Imran khan: ఓటమిని భరించలేక మీరు అరిచే అరుపులు టీవీల్లో చూస్తాం: ఇమ్రాన్‌పై మరియమ్ నవాజ్ నిప్పులు
- ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాలు
- 11 పార్టీలతో డెమొక్రటిక్ మూవ్‌మెంట్‌గా సంఘటితం
- నవాజ్‌ను ప్రధానిని చేసి ఇమ్రాన్‌ను జైలుకు పంపుతామని శపథం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపిస్తానని ముస్లింలీగ్ నవాజ్ ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ శపథం చేశారు. పాక్ ప్రతిపక్ష నేతలు బిలావల్ భుట్టో జర్దారీ, మరియం నవాజ్, మౌలానా ఫజ్లుర్ రెహమాన్, మెహమూద్ ఖాన్ అచక్‌జాయ్, మోసిన్ దవార్ తదితరులు కరాచీలో గత రాత్రి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం)గా ఏర్పడ్డారు. ఇది మొత్తం 11 పార్టీల కూటమి.
తొలి ర్యాలీని లాహోర్‌లోని గుజ్రన్‌వాలలో నిర్వహించగా, కరాచీలో నిన్న నిర్వహించిన ర్యాలీ రెండోది. ఈ ర్యాలీలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరియమ్ నవాజ్ మాట్లాడుతూ.. ఇమ్రాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఉపాధిని ఇమ్రాన్‌ఖాన్ తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఓటమిని భరించలేక మీరు అరిచే అరుపులను టీవీల్లో తప్పక చూస్తామని ఇమ్రాన్‌ను ఉద్దేశించి అన్నారు. త్వరలోనే నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తీసుకొస్తామని, అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కటకటాల్లోకి వెళ్లక తప్పదని అన్నారు.