Imran Khan: ఆర్మీ చీఫ్ బూట్లు శుభ్రం చేసే షరీఫ్ గద్దెనెక్కారు: ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు
- తమ ప్రభుత్వాన్ని కూల్చింది బజ్వానే అన్న షరీఫ్
- జవాన్లను అవమానిస్తున్నారన్న ఇమ్రాన్
- విదేశాలకు పారిపోయిన వ్యక్తి మాట్లాడుతున్నారని ఎద్దేవా
తమ ప్రభుత్వాన్ని కూలదోసింది ఆర్మీ చీఫ్ బజ్వాయేనని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్ బూట్లను శుభ్రం చేసే నవాజ్ షరీఫ్ గద్దెనెక్కారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనరల్ జియా ఉల్ హక్ 1980లలో మార్షల్ లా విధించినప్పుడు నవాజ్ షరీఫ్ రాజకీయాల్లోకి వచ్చారని... ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని అన్నారు. పాకిస్థాన్ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న జవాన్లను అవమానించేలా షరీఫ్ మాట్లాడారని మండిపడ్డారు. కేసుల భయంతో విదేశాలకు పారిపోయిన ఒక వ్యక్తి ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్ గురించి మాట్లాడుతున్నారని షరీఫ్ ను ఉద్దేశించి ఇమ్రాన్ విమర్శించారు.
2018లో ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని చేసేందుకు జనరల్ బజ్వా తమ ప్రభుత్వాన్ని పడగొట్టారని షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచేందుకు ఎన్నికల్లో రిగ్గింగ్ చేయించారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారని ఆరోపించారు. ఎంతో బాగా పని చేస్తున్న తమ ప్రభుత్వాన్ని బజ్వా కూల్చారని అన్నారు. దీని వెనుక ఐఎస్ఐ కుట్ర కూడా ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే షరీఫ్ పై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.