Air India: యూఏఈకి వెళ్లే ప్రయాణికులకు ఎయిరిండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక సూచన!
- కరోనా నేపథ్యంలో కీలక ప్రకటన
- రిటర్న్ టికెట్ లేకపోతే దుబాయ్ లోకి ప్రవేశం ఉండదని హెచ్చరిక
- అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దంటూ వార్నింగ్
సందర్శనార్థం పర్యాటక వీసాలపై యూఏఈ వెళ్లే ప్రయాణికులకు ఎయిరిండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు కీలక సూచనలు చేశాయి. అక్కడికి వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ముందుగానే రిటర్న్ టికెట్ కూడా తీసుకోవాలని నిబంధన విధించాయి. కరోనా నేపథ్యంలోనే ఈ నిబంధనను విధిస్తున్నట్టు సదరు సంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. రిటర్న్ టికెట్ బుక్ చేసుకోని ప్రయాణికులకు దుబాయ్ లోకి ప్రవేశం ఉండదని తెలిపాయి.
ఒక వేళ రిటర్న్ టికెట్ లేకుండా దుబాయ్ కు వెళ్లి అక్కడ చిక్కుకుపోతే... అలాంటి వారితో తమకు సంబంధం లేదని చెప్పారు. ఏఐ, ఇండిగో సంస్థలు ఈ షరతు విధించడానికి ఒక కారణం ఉంది. ఇటీవల ఇండియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన చాలా మంది ప్రయాణికులు రిటర్న్ టికెట్ లేకుండా దుబాయ్ కి వెళ్లి... అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా దుబాయ్ విమానాశ్రయంలో నానా అవస్థలు అనుభవించారు. గత గురువారం దాదాపు 140 మంది భారతీయ ప్రయాణికులను దుబాయ్ అధికారులు ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపించేశారు. ఈ నేపథ్యంలో రిటర్న్ టికెట్ కంపల్సరీ అంటూ ఈ రెండు ఎయిర్ లైన్స్ సంస్థలు షరతు విధించాయి.