Pat Cummins: బ్యాటింగ్ లో రాణించిన బౌలర్... కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోల్ కతా
- అబుదాబిలో ముంబయితో కోల్ కతా మ్యాచ్
- చేతులెత్తేసిన కోల్ కతా టాపార్డర్
- ప్యాట్ కమ్మిన్స్ అర్ధసెంచరీ
- కెప్టెన్ మోర్గాన్ తో కీలక భాగస్వామ్యం
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైన నేపథ్యంలో పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుతంగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. ప్రధాన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయగా, కమ్మిన్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
కమ్మిన్స్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో కొత్త కెప్టెన్ మోర్గాన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 పరుగులు నమోదు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మోర్గాన్ ఓ కళ్లు చెదిరే భారీ సిక్స్ సంధించాడు.
61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి కోల్ కతాను ఓ మోస్తరు స్కోరుకు తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా కమ్మిన్స్ కే దక్కుతుంది. తాను ఓ బౌలర్ అయినా గానీ బ్యాట్స్ మెన్ విఫలమైన చోట ఎంతో పట్టుదలతో ఆడి స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ 2 వికెట్లు తీయగా, బౌల్ట్, కౌల్టర్ నైల్, బుమ్రా తలో వికెట్ తీశారు.