Jagan: ఇంద్రకీలాద్రికి మణిహారం... కనకదుర్గ వంతెనను ప్రారంభించనున్న గడ్కరీ, జగన్!

Kanakagurga Fly Over Starts Today

  • పై వంతెన నేడు జాతికి అంకితం
  • మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా
  • 10 ప్రాజెక్టులు జాతికి అంకితం

కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రికి కంఠహారంగా రూపుదిద్దుకున్న ఫ్లై ఓవర్ నేడు జాతికి అంకితం కానుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రూ. 15,591 కోట్లకు పైగా విలువైన పలు పనులకు శంకుస్థాపన జరుగనుంది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ పై వంతెన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో 61 ప్రాజెక్టుల శంకుస్థాపనలతో పాటు, పూర్తయిన 10 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.

కాగా, విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి, ఈ వంతెన ప్రారంభం కావడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తక్షణమే దీన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు వంతెన ప్రారంభోత్సవం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత ప్రణబ్ ముఖర్జీ మృతితో, ఆపై గడ్కరీకి కరోనా సోకడంతో రెండుసార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో వర్చ్యువల్ విధానం ద్వారా దీన్ని ప్రారంభించాలని జగన్ భావించారు.

ఇక, నేడు ఉదయం 11.30 గంటలకు ఆన్ లైన్ లో గడ్కరీ, జగన్ చూస్తుండగా, ఏపీ రోడ్లు, భవనాల మంత్రి ఎం శంకర నారాయణ లాంఛనంగా వంతెనపైకి రాకపోకలను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితర అధికారులు కూడా పాల్గొంటారు.రూ. 501 కోట్లతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో రూ. 8 వేల కోట్లకు పైగా వ్యయంతో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు రూ.7,584 కోట్ల విలువైన పనులకు నేడు శంకుస్థాపన జరుగనుంది. నేడు జాతికి అంకితం కానున్న ప్రాజెక్టుల్లో పలు ప్రాంతాల్లోని 532 కిలోమీటర్లకు పైగా రహదారులు, పలు ఆర్వోబీలు ఉన్నాయి.

Jagan
Nitin Gadkari
Vijayawada
Fly Over
Kanakadurga
  • Loading...

More Telugu News