APSRTC: దసరా స్పెషల్ బస్సులపై ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా కుదరని ఒప్పందం!
- టైమ్ టేబుల్ మేము నిర్ణయించినట్టుగానే ఉండాలి
- తెలంగాణ అధికారుల పట్టు
- బస్సులపై నెలకొన్న సందిగ్ధత
దసరా నవరాత్రులు మొదలైపోయాయి. నగరాల నుంచి పండగకు సొంత ఊర్లకు వెళ్లాలని భావిస్తున్న వారికోసం మొత్తం 1,850 స్పెషల్ బస్సులను నడిపించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించగా, తెలంగాణకు నడిపించే సర్వీసులపై టీఎస్ ఆర్టీసీ కొత్త మెలిక పెట్టింది. తమ రాష్ట్రానికి వచ్చే ఏపీ ప్రత్యేక బస్సులు నడవాల్సిన సమయాన్ని తామే నిర్దేశిస్తామని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. బస్సులు నడవాల్సిన టైమ్ టేబుల్ తాము చెప్పిన ప్రకారమే ఉండాలని టీఎస్ అధికారులు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపించే ఒప్పందం రెండు రాష్ట్రాల మధ్య కుదరకపోవడంతో సాధారణంగా తిరగాల్సిన సర్వీసులు తిరగడం లేదు. ఏపీ నుంచి ఒడిశా, కర్ణాటకలకు బస్సులు వెళుతుండగా, తెలంగాణ నుంచి ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకకు బస్సులు తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం ఇంకా బస్సులు నడవడం లేదు. ఏపీ, టీఎస్ మధ్య అత్యంత డిమాండ్ ఉన్న హైదరాబాద్- విజయవాడ, విశాఖ - హైదరాబాద్, కర్నూలు - హైదరాబాద్, హైదరాబాద్ - తిరుపతి, హైదరాబాద్ - నెల్లూరు, ఖమ్మం - తాడేపల్లి గూడెం, విజయవాడ - భద్రాచలం రూట్లతో పాటు చాలా గమ్య స్థానాలకు బస్సులు నడవడం లేదు.
గత సంవత్సరం దసరా సీజన్ లో ఏపీఎస్ ఆర్టీసీ 2,500కు పైగా ప్రత్యేక బస్సులను నడిపించింది. ఈ సంవత్సరం వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఏపీ సర్కారు 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సులను తగ్గించుకునేందుకు సిద్ధం కాగా, తెలంగాణ సర్కారు తాజా నిబంధనలతో ప్రతిష్ఠంభన మరింతగా పెరిగింది. ఏపీ నుంచి వచ్చే బస్సుల సమయాలను తాము నిర్దేశిస్తామని చెప్పడమే ఇందుకు కారణం. తెలంగాణ వైఖరిని ఏపీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఇదిలావుండగా, ఏపీ, టీఎస్ రోడ్డు రవాణా సంస్థల మధ్య నెలకొన్న వివాదాన్ని ప్రైవేటు ఆపరేటర్లు అలుసుగా తీసుకుని, ప్రయాణికులను దోచుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే దసరా సీజన్ రేట్లు ఆకాశానికి అంటాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఎవరైనా రాష్ట్రాలు దాటాలంటే ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సిందే. ఇదే అదనుగా, ప్రైవేటు కంపెనీలు 750 బస్సులను రంగంలోకి దించాయి. వీటిల్లో ఆన్ లైన్ రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభం కాగా, టికెట్ చార్జీలను భారీగా పెంచేశారు.
అధిక రేట్లు వసూలు చేస్తే, కఠిన చర్యలు ఉంటాయని రెండు ప్రభుత్వాలూ హెచ్చరిస్తున్నా, నవరాత్రి రోజుల్లో ప్రైవేటు బస్సుల్లో విజయవాడ వరకూ వెళ్లేందుకు రూ. 1000కి పైగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. తక్షణం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ స్పందించి, బస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.