Uttam Kumar Reddy: రాష్ట్రంలో మార్పుకు దుబ్బాక ఎన్నికలతో శ్రీకారం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- దుబ్బాక ఉప ఎన్నికల నామినేషన్ పర్వం
- కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్
- భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి అగ్రనేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... రాష్ట్రంలో మార్పునకు దుబ్బాక ఎన్నికలు నాంది పలుకుతాయని అన్నారు. రాష్ట్రాన్ని వంచించిన సీఎం కేసీఆర్ కు ఈ ఉప ఎన్నికల ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఉత్సాహం ఉరకలెత్తుతోంది: కోమటిరెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం 1,100 మంది పిల్లలు ఆత్మత్యాగాలు చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు.
దుబ్బాకలో శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని, ఈ ఉత్సాహమే కాంగ్రెస్ విజయానికి ఢోకా లేదనే సంకేతాలు ఇస్తోందని తెలిపారు. ముత్యం వంటి మనిషి చెరుకు ముత్యంరెడ్డి వారసత్వాన్ని నిలబెట్టేందుకు దుబ్బాకలో ఈసారి ప్రజలు కాంగ్రెస్ కు పట్టంకట్టడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.