KCR: గతంలో "వ్యవసాయం చేసుడు కన్నా పాన్ డబ్బా నడుపుడు నయం" అనే సామెత ఉండేది: సీఎం కేసీఆర్
- వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
- ఉమ్మడి పాలనలో తెలంగాణ వ్యవసాయం దెబ్బతిన్నదని వ్యాఖ్యలు
- ఇప్పుడు కేంద్రమే తమ బాటలో నడుస్తోందన్న సీఎం కేసీఆర్
- అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచామని వెల్లడి
- తమ రైతు బీమా ప్రపంచంలో మరెక్కడా లేదని ఉద్ఘాటన
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, గత పాలనలో తెలంగాణ వ్యవసాయం గాలికి దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అనే రీతిలో సాగిందని విమర్శించారు. అప్పట్లో వ్యవసాయం చేసుడు కన్నా పాన్ డబ్బా నడుపుడు నయం అనే సామెత ఉండేదని, కానీ ఇప్పుడు వ్యవసాయమే లాభసాటి వ్యాపారంగా మారిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల ఉన్న అభిప్రాయాలను తెలంగాణ స్వయంపాలన తిరగరాసిందని పేర్కొన్నారు.
తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలనే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేశాయని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని ఒడిశాలో కాలియా పేరుతో అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తనముందే మీడియాకు చెప్పారని, ఇది తెలంగాణకు గర్వకారణం అని వెల్లడించారు. అంతేకాదు, కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బంధు పథకమే స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ తీసుకువచ్చిన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా అమలులో లేదని ఉద్ఘాటించారు.
"తెలంగాణ వ్యవసాయం దేశానికి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర విభజన సమయానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల గోదాములను ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం మామూలు విషయం కాదు. రైతులు స్వయం సమృద్ధితో పంటలు పండిస్తున్నారు. రైతులకు సకాలంలో పంట పెట్టుబడి, నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్, కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది.
ముఖ్యంగా పాలమూరు జిల్లా వ్యవసాయం అభివృద్ధి చెందడం తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి నిదర్శనం. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ, అటవీప్రాంతం విస్తరణతో అత్యధిక వర్షపాతం పొందుతున్న జిల్లాగా ఉంది. రాబోయే యాసంగి సీజన్ కు 70 లక్షల ఎకరాలు సాగుకు సిద్ధమయ్యాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దీన్నిబట్టే తెలంగాణ వ్యవసాయం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరిందని స్పష్టమవుతోంది" అని సీఎం కేసీఆర్ వివరించారు.