AB de Villiers: చిచ్చరపిడుగులా ఆడిన ఏబీ డివిల్లీర్స్.. బెంగళూరు పరుగుల మోత
- 33 బంతుల్లో 73 పరుగులు చేసిన ఏబీ
- 5 ఫోర్లు, 6 సిక్సులతో ఊచకోత
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసిన బెంగళూరు
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్ లో ఏబీ డివిల్లీర్స్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. డివిల్లీర్స్ కేవలం 33 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఏబీ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 భారీ సిక్స్ లు ఉన్నాయి. బౌలర్ ఎవరైనా కానీ ఊచకోత కోయడమే లక్ష్యంగా మిస్టర్ 360 ఇన్నింగ్స్ సాగింది. ఎటు బంతి వేస్తే అటు బాదుతూ కోల్ కతా బౌలర్లను చితకబాదాడు.
ఇక, కోహ్లీ యాంకర్ రోల్ పోషించాడు. చురుగ్గా స్ట్రైకింగ్ మార్చుతూ వీలైనంతగా ఏబీకి అవకాశం ఇచ్చాడు. కోహ్లీ 28 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 32, ఆరోన్ ఫించ్ 47 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 1, ఆండ్రీ రస్సెల్ 1 వికెట్ తీశారు.