Mutha Gopal: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు కాంగ్రెస్ కార్యకర్తల సెగ
- ముషీరాబాద్ లో హైకోర్టు ఉద్యోగి మృతి
- వర్షపు నీరు సెల్లార్ లోకి చేరడంతో షార్ట్ సర్క్యూట్
- ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్
హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అసలేం జరిగిందంటే... రెండ్రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ లో హైకోర్టు ఉద్యోగి రాజ్ కుమార్ మరణించారు. సెల్లార్ లో వర్షపు నీరు చేరడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఆయన మృత్యువాత పడ్డారు.
దాంతో రాజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు. అదే సమయంలో టీఆర్ఎస్ శాసనసభ్యుడు ముఠా గోపాల్ ఆ మార్గం గుండా వెళుతుండడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను నిలువరించారు. ఆయనను రాజ్ కుమార్ నివాసానికి తీసుకువచ్చి, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నేతలు బాహాబాహీకి సిద్ధమవడంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.