rain: హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం

rain in hyderabad

  • షేక్‌పేట, మణికొండ, గోల్కొండ, ఫిలిమ్‌నగర్ లో వర్షం
  • శేర్‌లింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లోనూ వాన
  • రేపు కూడా వర్షాలు పడే అవకాశం
  • తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. షేక్‌పేట, మణికొండ, గోల్కొండ, ఫిలిమ్‌నగర్, బంజరాహిల్స్, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌, శేరి లింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.  

పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మ్యాన్‌హోల్స్ ద్వారా నీటిని పంపేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. కాగా, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లోనూ నిన్న రాత్రి నుంచి పలు చోట్ల  వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు అత్యధికంగా దుబ్బాకలో 82 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి,  నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, కుమ్రంభీం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లిల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

కాగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించింది. తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశ ముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

rain
Hyderabad
Mahabubabad District
Telangana
  • Loading...

More Telugu News