CBI: యూపీ పోలీసుల నుంచి హత్రాస్ కేసు దర్యాప్తును స్వీకరించిన సీబీఐ
- హత్రాస్ లో దళిత యువతిపై పైశాచిక అఘాయిత్యం
- సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన యోగి సర్కారు
- ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు
సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచారం, హత్య ఘటనపై ఇటీవలే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తుండడంతో యూపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, యూపీ పోలీసుల నుంచి హత్రాస్ కేసు దర్యాప్తును సీబీఐ ఇవాళ స్వీకరించింది.
19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబరు 14న అత్యంత పాశవిక రీతిలో దాడి జరిగింది. ఆమె ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే, ఎంతో హడావుడిగా పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా నేరుగా శ్మశానానికి తరలించి దహనం చేశారు. పోలీసుల చర్య పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ హత్యాచార ఘటనతో యూపీ భగ్గుమంది. యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.