Supreme Court: ప్రైవేటు పీజీ వైద్య విద్యా కళాశాలల్లో ఎన్నారై కోటా అవసరంలేదు: సుప్రీం కీలక తీర్పు
- గతంలో ఎన్నారై కోటా రద్దు చేసిన నీట్ పీజీ మెడికల్ బోర్డు
- సుప్రీంలో సవాల్ చేసిన ఇద్దరు విద్యార్థులు
- ఎన్నారై కోటా హక్కేమీ కాదన్న అత్యున్నత న్యాయస్థానం
- ఎన్నారై కోటాపై కాలేజీలు స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడి
విదేశాల్లో ఉండే భారతీయుల కోసం దేశంలోని ప్రైవేటు వైద్యకళాశాలల్లో ఎన్నారై కోటా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నీట్ పీజీ మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్ బోర్డు ఎన్నారై కోటాను రద్దు చేయగా, ఇద్దరు విద్యార్థులు ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ప్రైవేటు పీజీ వైద్య విద్య కళాశాలల్లో ఎన్నారై కోటా అవసరంలేదని పేర్కొంది. ప్రవాస భారతీయులకు ఎన్నారై కోటా కింద విధిగా సీట్లు కేటాయించాల్సిన పనిలేదని, ప్రైవేటు పీజీ వైద్య విద్య కళాశాలల్లో ఎన్నారై కోటా అనేది హక్కేమీ కాదని స్పష్టం చేసింది. అయితే, ఎన్నారైలకు సీట్లు కేటాయించాలో, వద్దో ఆయా కాలేజీ యాజమాన్యాలు స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు 28 పేజీల తీర్పు వెలువరించింది.
ఇదేమీ సవరించరానంత పరమోన్నత నిబంధనేమీ కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవేళ ఏదైనా విద్యాసంస్థ కానీ, రాష్ట్ర స్థాయి అధికారిక సంస్థ కానీ ఎన్నారై కోటాను రద్దు చేయాలనుకుంటే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలను వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేయాలని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం దిశానిర్దేశం చేసింది.