Kanakamedala Ravindra Kumar: వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదు: కనకమేడల
- కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫారసు మేరకు అమరావతి నిర్ణయం
- విభజన చట్టం ప్రకారమే రాజధానిని ఎంపిక చేశాం
- కులముద్ర వేసి అమరావతిని నాశనం చేస్తున్నారు
రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరుల దారులన్నింటినీ మూసేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలో కొనసాగుతోందని అన్నారు.
విభజన చట్టం ప్రకారమే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో పాటు వివిధ కమిటీల సిఫారసు మేరకే అమరావతిని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. సీఆర్డీయేను రూపొందించి, దాని ద్వారా అమరావతి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుకు వ్యతిరేకంగా అమరావతిని నిర్ణయించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కనకమేడల అన్నారు. రైతులు 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం త్యాగం చేయడం చారిత్రాత్మకమని చెప్పారు.
అమరావతిపై కులముద్ర వేసి నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు. కోర్టు సూచనలు, సలహాలు, తీర్పులను కూడా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. న్యాయ వ్యవస్థపైనే వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటం దారుణమని వ్యాఖ్యానించారు.