Assembly: రెండ్రోజుల పాటు తెలంగాణ చట్టసభల సమావేశాలు... రేపు సాయంత్రం కేబినెట్ భేటీ
- ఈ నెల 13న అసెంబ్లీ సమావేశాలు
- 14వ తేదీన శాసనమండలి సమావేశాలు
- జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు చేసే అవకాశం
- హైకోర్టు సూచించిన అంశాలపైనా చర్చ!
గత అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన తెలంగాణ సర్కారు జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, మరికొన్ని ఇతర అంశాల్లో చర్చించడం కోసం రెండ్రోజుల పాటు చట్టసభల సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 13న అసెంబ్లీ సమావేశాలు, 14న శాసనమండలి సమావేశాలు జరుపనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం అవుతాయి. మండలి సమావేశాలు ఈ నెల 14న ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాయి. 13వ తేదీన అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశపెడతారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో మార్పులుచేర్పులకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల హైకోర్టు సూచించిన కొన్ని అంశాలపైనా చట్టసభలో చర్చించి చట్టాలు తీసుకురానున్నారు.
కాగా, గత నెలలో జరిగిన అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిస్తున్నట్టు అటు అసెంబ్లీ స్పీకర్ గానీ, ఇటు మండలి చైర్మన్ గానీ ప్రకటించలేదు. వాయిదా వేసినట్టు మాత్రమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుపబోయే రెండ్రోజుల సమావేశాలకు గవర్నర్ అనుమతితో పనిలేకుండా నేరుగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
రేపు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశంలో... అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించనున్నారు. రాబోయే సీజన్ లో అమలు చేయాల్సిన నిర్ణీత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలు అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.