YSRCP: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంస్థపై సీబీఐ కేసు.. 11 ప్రాంతాల్లో సోదాలు!

YSRCP MP Raghu Rama Krishna Raju in great troubles

  • వ్యాపారం కోసం తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారంటూ ఫిర్యాదు
  • ఇండ్-భారత్ థర్మల్ పవర్, ఆ సంస్థ డైరెక్టర్లపై కేసులు
  • రూ. 826.17 కోట్ల నష్టం కలిగించినట్టు బ్యాంకు ఆరోపణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజు చిక్కుల్లో పడ్డారు. వ్యాపారం కోసం తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఎంపీకి చెందిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌తోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, అధికారులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది మార్చి 21న బ్యాంకు చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదు చేయగా, మంగళవారం కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న హైదరాబాద్, ముంబై, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... ఇండ్-భారత్ సంస్థకు వివిధ బ్యాంకులు కలిసి రూ. 941 కోట్లు, దీనికి అదనంగా మరో రూ. 62.80 కోట్లు మంజూరు చేశాయి. కర్ణాటకలో తొలుత విద్యుత్ ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసిన ఇండ్-భారత్, ఆ తర్వాత దానిని తమిళనాడులోని ట్యుటుకోరిన్‌కు మార్చింది. సంస్థ ఏర్పాటు తర్వాత వివిధ పద్ధతుల ద్వారా నిధులను మళ్లించారు. విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు ద్వారా కూడా నిధులను మాయం చేసినట్టు బయటపడింది.

2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 516.20 కోట్ల విలువైన 14,70,861 టన్నుల బొగ్గును కొనుగోలు చేసినట్టు సంస్థ చూపించింది. అయితే, ఆడిట్‌లో మాత్రం అంత బొగ్గు నిల్వలేదు. కొనుగోళ్ల రశీదులు అడిగితే పాడైపోయినట్టు చెప్పారు. బొగ్గు సరఫరా వివరాలను వేబ్రిడ్జిలో పరిశీలించేందుకు అధికారులు ప్రయత్నించగా కంప్యూటర్‌లో ఆ వివరాలు నిక్షిప్తం కాలేదని చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి.

కంపెనీ లావాదేవీల్లో అవకతకవలను గుర్తించిన బ్యాంకులు సంస్థను పలుమార్లు హెచ్చరించాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సంస్థను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చారు. నిందితుల జాబితాలో ఉన్న ఇండ్-భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రఘురామకృష్ణరాజు, కోటగిరి ఇందిర ప్రియదర్శిని, గోపాలన్ మనోహరన్, నంబూరి కుమారస్వామి,  ఎండీ సీతారామం కొమరగిరి, అడిషనల్ డైరెక్టర్లు నారాయణ ప్రసాద్ భాగవతుల, బొప్పన సౌజన్య, వీరవెంకట సత్యనారాయణరావు వడ్లమాని, విస్సాప్రగడ పేర్రాజు కలిసి లబ్ధిపొందేందుకు ప్రయత్నించి రూ. 826.17 కోట్ల నష్టం కలిగించినట్టు సౌరభ్ మల్హోత్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

YSRCP
Raghu Rama Krishna Raju
CBI
Punjab national bank
ind barath power infra ltd
  • Loading...

More Telugu News