Python: చేపల కోసం వల వేస్తే 15 అడుగుల పాము చిక్కింది!
- కృష్ణా జిల్లాలో ఘటన
- కృష్ణానది పాయలో వల విసిరిన జాలర్లు
- కొండచిలువను చూసి హడలిపోయిన వైనం
ఇటీవలే తెలంగాణలో కొందరు జాలర్లు వల వేస్తే కొండచిలువ చిక్కుకుంది. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి ఘటనే జరిగింది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానది పాయలో కొందరు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారు. చేపల కోసం వల విసరగా, చేపలతో పాటు పెద్ద కొండచిలువ కూడా పడింది. 15 అడుగుల ఆ కొండచిలువను చూసి జాలర్లు హడలిపోయారు. వెంటనే ఈ విషయాన్ని వారు స్థానిక అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. తమ ప్రాంతంలో కొండచిలువను ఎప్పుడూ చూడలేదని, ఇది ఇటీవలి వరదలకు కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు అంటున్నారు.
గత నెలలో తెలంగాణలోని వరంగల్ రూరల్ వర్ధన్నపేట మండలంలోని ఓ వాగులో వల విసిరితే ఇలాంటిదే పెద్ద కొండచిలువ చిక్కింది. దాన్ని వల నుంచి తప్పించిన మత్స్యకారులు స్థానిక అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.