Jagan: 'జగనన్న విద్యాకానుక' ప్రారంభం.. కిట్లు అందుకుని మురిసిపోయిన విద్యార్థులు.. ఫొటోలు ఇవిగో

jagananna scheme lauches by jagan

  • విద్యార్థులకు కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు
  • మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌
  • యూనిఫాం కుట్టుకూలీ కోసం రూ.120
  • విప్లవాత్మక మార్పులు చేపట్టామ‌న్న జ‌గ‌న్  

ఏపీ వ్యాప్తంగా మొత్తం 42,34,322 మంది బడి విద్యార్థులకు సుమారు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్ కిట్లు’ అందచేసే జగనన్న విద్యాకానుక ప‌థ‌కాన్ని సీఎం జ‌గ‌న్ ఈ రోజు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాల నుంచి ప్రారంభించారు.  కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలతో పాటు మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌ వంటి పలు రకాల వస్తువులని కొంద‌రు చిన్నారుల‌కు అందించారు.  

క‌రోనా నేప‌థ్యంలో ఒక్కో విద్యార్థికి ఈ సారి మూడు మాస్కులు కూడా ఇందులో భాగంగా అందిస్తున్నారు. విద్యార్థులను ప్రేమగా పలకరించి జ‌గ‌న్ కాసేపు వారితో మాట్లాడారు. తరగతి గదుల్లో కూర్చుని విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ బ‌డుల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడం,  మెరుగైన ఫలితాలు సాధించడం, వారికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డ‌మే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో తీసుకున్న చిన్నారులు మురిసిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్‌ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాల కోసం బ‌ట్ట‌, బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు వారు చ‌దువుతోన్న‌ తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టించుకోవ‌డానికి కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ... ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలని, చదువే విద్యార్థులకు ఒక శక్తి అని చెప్పారు. పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారని, స్కూళ్లలో డ్రాప్ అవుట్స్‌పై గత ప్రభుత్వం ఆలోచించలేదని విమ‌ర్శించా‌రు.

ఇంగ్లిషు మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయని ఆయ‌న తెలిపారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టామ‌ని జ‌గ‌న్ చెప్పారు. వ‌చ్చేనెల  2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామ‌ని తెలిపారు.    

        

  • Loading...

More Telugu News