Telangana: తెలంగాణలో 'సినిమా' ఇప్పట్లో లేనట్టే... తొందర లేదంటోన్న ప్రభుత్వం!

No Movie Theaters in Telangana as off Now

  • 15 నుంచి తెరచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు
  • ఇప్పట్లో అనుమతించలేమన్న సోమేశ్ కుమార్
  • పలు రకాల కార్యక్రమాలకు 100 మందికి అనుమతి
  • అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు జారీ

ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లతో పాటు మల్టీ ప్లెక్స్ లు, ఎంటర్ టెయిన్ మెంట్ పార్కులు, కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు తిరిగి ప్రారంభించుకోవచ్చని, ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తమకు అనుమతి లభిస్తుందన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ థియేటర్ల సంఘం, సినిమా హాల్స్ ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ, 15 నుంచి వీటిని తెరవడానికి వీల్లేదని, రాష్ట్రంలో అన్ లాక్ 5.0కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ, సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్కూళ్లు, సినిమా హాల్స్ విషయంలో తొందరపడటం లేదని, వాటి పునఃప్రారంభంపై తేదీలను తదుపరి తెలుపుతూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక తన ఉత్తర్వుల్లో కాలేజీలు, విద్యా సంస్థలు ఆన్ లైన్ లేదా దూర విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కంటైన్ మెంట్ జోన్లకు వెలుపల లాక్ డౌన్ కు ముందు అనుమతించిన అన్ని పనులను, ఇకపై కూడా అనుమతిస్తారు. కరోనా ప్రొటోకాల్ ను పాటిస్తూ, స్విమ్మింగ్ పూల్స్,  కమర్షియల్ ఎగ్జిబిషన్ వ్యాపారాలు, క్రీడాకారుల శిక్షణా కేంద్రాలను 15 నుంచి తెరచుకోవచ్చని ఆయన తెలిపారు.

విద్య, క్రీడా, వినోద, సామాజిక, మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, కంటైన్ మెంట్ జోన్ల బయట 100 మందికి మించకుండా చేసుకోవచ్చు.  అన్ని రకాల శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా 100 మందికి లోబడే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మైదానం విస్తీర్ణాన్ని బట్టి, అధిక సంఖ్యలో ఆహూతులను అనుమతించే అంశం స్థానిక కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీల చేతుల్లో ఉంటుంది.

  • Loading...

More Telugu News