Dinesh Kumar Khara: నేటితో ముగియనున్న రజనీశ్ పదవీ కాలం... ఎస్బీఐ తదుపరి చైర్మన్ గా దినేశ్ కుమార్!
- కొత్త చైర్మన్ పై మంగళవారం నోటిఫికేషన్
- నేడు బాధ్యతలు స్వీకరించనున్న దినేశ్ కుమార్ ఖారా
- గడచిన 33 ఏళ్లుగా ఎస్బీఐతోనే ఉన్న దినేశ్
- ప్రొబేషనరీ ఆఫీసర్ నుంచి.. ఎన్నో స్థాయుల్లో విధులు
ఇండియాలో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ చైర్మన్ పదవిని నేడు దినేశ్ కుమార్ ఖారా చేపట్టనున్నారు. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న రజనీశ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుండగా, కొత్త చైర్మన్ ను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభించి, దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన వేళ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ తిరిగి గాడిలో పడే ప్రయత్నంలో దినేశ్ కుమార్ ముందు గట్టి సవాలే ఉన్నట్టని బ్యాంకింగ్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
కాగా, మంగళవారం నాడు దినేశ్ కుమార్ ను ఎస్బీఐ చైర్మన్ గా నియమించిన కేంద్రం, మూడు సంవత్సరాల పాటు ఆయన పదవిలో ఉంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆగస్టు 28న సమావేశమైన బ్యాంకు బోర్డు బ్యూరో, దినేశ్ కుమార్ ను తదుపరి చైర్మన్ చేయాలని సిఫార్సు చేసింది. ఆగస్టు 2016 లోనే ఎస్బీఐలోనే మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, పనితీరు సమీక్ష తరువాత, మరో రెండేళ్ల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆపై దినేశ్ కుమార్ ఆధ్వర్యంలోనే ఎస్బీఐలో ఐదు అసోసియేట్ బ్యాంకులు విలీనం కాగా, ఏప్రిల్ 2017లో భారతీయ మహిళా బ్యాంకు విలీనం జరిగింది.
కాగా, దినేశ్ కుమార్ ఖారా ఉద్యోగ జీవితమంతా ఎస్బీఐలోనే కొనసాగింది. 1984లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా బ్యాంకులో చేరిన ఆయన, ఈ 33 సంవత్సరాల వ్యవధిలో తన సామర్థ్యంతో ఎన్నో ప్రమోషన్ లు అందుకున్నారు. కమర్షియల్ బ్యాంకింగ్ లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. రిటైల్ క్రెడిట్, ఎస్ఎంఈ/కార్పొరేట్ క్రెడిట్, డిపాజిట్ల పెంపు, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్రాంచ్ మేనేజ్ మెంట్ తదితరాల్లో ఆయన అనుభవం బ్యాంకు వృద్ధికి దోహదపడింది. ప్రస్తుతం 59 సంవత్సరాల వయసున్న ఆయన, తన మాస్టర్స్ డిగ్రీని ఢిల్లీ యూనివర్శిటీలో పూర్తి చేశారు. ఆపై వాణిజ్య శాస్త్రంలో పీజీ చేశారు.