Mayawati: చాలు, ఇక ఆపండి.. ఆ కుటుంబానికి న్యాయం చేయండి: మాయావతి
- ఘర్షణలు రేకెత్తించేందుకు ప్రతిపక్షాల కుట్రన్న ప్రభుత్వం
- తప్పుదిద్దుకోకుంటే డేంజరన్న మాయావతి
- ఎన్నికల ట్రిక్‌లో భాగమేనని మండిపాటు
హత్రాస్ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని, రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు సృష్టించేందుకు, అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నాయంటూ యోగి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు.
ఈ ఆరోపణలను ఎన్నికల ట్రిక్‌గా అభివర్ణించిన మాయావతి.. ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పును సరిద్దుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజమైనవా? లేక, ఎన్నికల ట్రిక్‌లో భాగమా? అన్నదానిని కాలమే నిర్ణయిస్తుందన్నారు.
అనవసర ఆరోపణలను కట్టిపెట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయడంపై దృష్టిసారిస్తే మంచిదని హితవు పలికారు. బాధిత కుటుంబంపై పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తప్పును సరిదిద్దుకోకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని మాయావతి అన్నారు.