White House: కరోనా పూర్తిగా నయం కాకుండానే వచ్చేసిన ట్రంప్... హడలిపోతున్న వైట్ హౌస్ సిబ్బంది!
- సైనిక ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన ట్రంప్
- డిశ్చార్జి అయి వైట్ హౌస్ కు చేరిక
- మాస్కు తీసేసి ఫొటోలకు పోజులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొన్నిరోజుల క్రితం కరోనా సోకగా, ఆయనకు వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స అనంతరం ట్రంప్ తన అధికారిక నివాసం వైట్ హౌస్ కు చేరుకోగా, ఆయన వైఖరి తెలిసిన ఉద్యోగులు హడలిపోతున్నారు.
కరోనా పూర్తిగా నయం కాకపోయినా, వచ్చీరావడంతోనే మాస్కు తీసేసి ఫొటోలకు పోజులిచ్చిన ట్రంప్ తీరు వైట్ హౌస్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. మాస్కు ధరించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ట్రంప్ తన నిర్లక్ష్య వైఖరితో ఎక్కడ తమకు కరోనా అంటిస్తారోనని ఉద్యోగులు భయపడుతున్నారు. ఆయన నిబంధనలు పాటిస్తే సరి, పాటించకపోతే తమ పరిస్థితి ఏంటన్నది వారిని అనిశ్చితికి గురిచేస్తోంది.
మామూలు పరిస్థితుల్లో వైట్ హౌస్ లో 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. వారిలో పారిశుద్ధ్య పనివారి నుంచి వంటవాళ్లు, బట్లర్లు తదితరులు ఉంటారు. ఇటీవల ట్రంప్ తో పాటు కొందరు ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కరోనా సోకిన నేపథ్యంలో వైట్ హౌస్ సిబ్బందిని సగానికి తగ్గించారు. వారికి మాస్కులు, ఇతర జాగ్రత్త చర్యలు తప్పనిసరి చేశారు.