Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం... రాష్ట్రాభివృద్ధి అంశాలే అజెండా!
- దాదాపు 40 నిమిషాల పాటు సాగిన భేటీ
- జగన్ ప్రతిపాదనలకు ప్రధాని సానుకూల స్పందన
- అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కరోనా పరిస్థితులు, విభజన హామీలు, రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిలు వంటి అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించారు.
మొత్తం 17 అంశాలను జగన్ ప్రధానికి నివేదించారు. ప్రత్యేకంగా, జీఎస్టీ చెల్లింపులు, రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, దిశ సహా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ఏపీ బిల్లులపైనా ఆయన ప్రధానికి తెలియజేశారు. దాదాపు సీఎం జగన్ ప్రతిపాదనలన్నింటికీ ప్రధాని మోదీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం.
కాగా, ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్డీయేలో చేరుతున్నారని, కేబినెట్ మంత్రి పదవుల బేరం కోసమని ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే, అలాంటిదేమీ లేదని వెల్లడైంది.
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ భేటీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ వాదనలు మరింత సమర్థంగా వినిపించేందుకు ఈ సమావేశంలో సీఎం జగన్ తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.
.