IMD: బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి చాన్స్: ఐఎండీ హెచ్చరిక
- 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- మరో రెండు రోజులు వర్షాలకు చాన్స్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం వచ్చే నాలుగు రోజుల్లో ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉత్తర అండమాన్ తీర ప్రాంతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం నుంచి దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకూ అల్పపీడనం ఉందని, దానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.
ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 9వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని, ఆ తరువాత మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నారాయణ పేట్ ప్రాంతంలో అత్యధికంగా 4.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగతా జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి.
ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయని, ఈ సీజన్ లో ఇప్పటి వరకూ సగటున 18.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి వుండగా, నిన్నటివరకూ 5.5 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని, రానున్న అల్పపీడనాలతో మరింత వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.