BJP: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడి కాల్చివేత.. ఉద్రిక్తత

BJP leader shot dead in West Bengal

  • టిటాగఢ్ మునిసిపల్ కౌన్సెలర్‌పై ముసుగు వ్యక్తుల కాల్పులు
  • బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు
  • బీజేపీలో అంతర్గత పోరుకు ఇది నిదర్శనమన్న టీఎంసీ

పశ్చిమ బెంగాల్‌లో ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగఢ్ మునిసిపల్ కౌన్సెలర్ మనీశ్ శుక్లాపై నిన్న రాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మనీశ్ శుక్లాను వెంటనే కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు.

మనీశ్ మృతి విషయం తెలిసిన బీజేపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మరోవైపు, మనీశ్ హత్యకు నిరసగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.

మనీశ్ కాల్చివేతపై ఎంపీ అర్జున్ సింగ్ స్పందించారు. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ పనేనని ఆరోపించారు. పోలీసుల సమక్షంలో కాల్పులు జరిగాయన్నారు. మనీశ్ తనకు సోదరుడి లాంటివాడన్నారు. అధికార టీఎంసీ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ వర్గీయ మాట్లాడుతూ ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.  

బీజేపీ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈ హత్యతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బీజేపీలోని అంతర్గత పోరుకు మనీశ్ హత్య నిదర్శనమని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో అధికార పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ నేత నిర్మల్ ఘోష్ మండిపడ్డారు.

BJP
TMC
West Bengal
shot dead
Arjun Singh
  • Loading...

More Telugu News