Priyanka Gandhi: హత్రాస్ బాధిత కుటుంబం న్యాయ విచారణ కోరుతుంటే సిట్ తో కాలయాపన ఎందుకు?: ప్రియాంక గాంధీ
- హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించిన యూపీ సర్కారు
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలన్న బాధితురాలి కుటుంబం
- బుల్ గాడీ గ్రామం చేరుకున్న సిట్ అధికారులు
హత్రాస్ ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కారు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. మృతురాలి కుటుంబం సుప్రీంకోర్టు విచారణ కోరుకుంటోందని, ఇలాంటప్పుడు సిట్ తో కాలహరణం తప్ప మరో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అయినా ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత సిట్ ఎందుకుని ప్రశ్నించారు. సీబీఐకి అప్పగించిన తర్వాత కూడా దర్యాప్తు పేరిట సిట్ వివరాలు సేకరిస్తుండడం అవసరమా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, హత్రాస్ మృతురాలి కుటుంబీకులు తమకు సీబీఐ విచారణ వద్దని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుకుంటున్నారు. హత్రాస్ ఘటనలో బాధిత కుటుంబం నుంచి సమాచారం తెలుసుకునేందుకు సిట్ అధికారులు బుల్ గడీ గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ తాజా వ్యాఖ్యలు చేశారు.
బాధితురాలి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్నట్టుగా ఓ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆ కలెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రియాంక డిమాండ్ చేశారు. పెద్ద కులాలకు చెందిన నిందితుల్ని కాపాడేందుకు ఆ కలెక్టర్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రియాంక ఆరోపించారు.