Donald Trump: కరోనాకు నివారణగా ప్రయోగాత్మక కాక్ టైల్ తీసుకున్న డొనాల్డ్ ట్రంప్!
- యాంటీ బాడీ కాక్ టెయిల్ ను తయారు చేసిన రెజెనేరన్
- ఇప్పటికే మూడు దశల పరీక్షలు పూర్తి
- ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వారికి ఉపయుక్తం
కొవిడ్ -19 బారిన పడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనదైన శైలిని చూపుతూ వినూత్న నిర్ణయం తీసుకోవడంతో పాటు, దాన్ని అమలు చేశారు. ప్రయోగాత్మకంగా తయారు చేసిన యాంటీబాడీ కాక్ టెయిల్ ను ఆయన కరోనా ట్రీట్ మెంట్ లో భాగంగా తీసుకున్నారు.
ఈ విషయం బయటకు తెలియగానే, ఇంతకీ ఈ చికిత్స ఏంటన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఆయన తీసుకున్న కాక్ టైల్ పేరు 'ఆర్ఈజీఎన్ - సీఓవీ2'. పలు రకాల ఔషధాలతో కలిపి తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం. ఇది శరీరంలోని వైరస్ లోడ్ ను, లక్షణాలు బయటకు వచ్చే సమయాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేని వారికి మరింతగా ఉపకరిస్తుందని అంచనా. దీన్ని రెజెనేరన్ ఫార్మాస్యుటికల్స్ ఐఎన్సీ అభివృద్ధి చేసింది.
దీనిలో రెండు రకాల మోనోలోకల్ యాంటీ బాడీస్ ఉంటాయి. ఆర్ఈజీఎన్ 10933, ఆర్ఈజీఎన్ 10987 పేర్లతో ఉన్న యాంటీ బాడీలు ప్రత్యేకంగా సార్స్ కోవ్-2ను అడ్డుకుని, వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఇక ఈ కాక్ టెయిల్ గురించి మరింత లోతుగా వెళితే, ఇది ఇప్పటికే ఒకటి, రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది. తొలి దశలో 275 మంది, రెండు, మూడవ దశల్లో 1,300 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు.
జూన్ లోనే మానవులపై ప్రయోగాలు మొదలయ్యాయి. ఈ మూడు దశల్లోనూ వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఫలితాలు రాలేదు. అంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లనూ పరిశోధకులు గుర్తించలేదు. కాగా, ఇప్పటివరకూ ఈ ట్రయల్స్ హాస్పిటల్ లో చేరే అవసరం లేని కరోనా సోకిన వారిపై మాత్రమే ప్రయోగించారు. ఈ ట్రయల్స్ గురించి తెలుసుకున్న ట్రంప్ దీన్ని తీసుకున్నారు. దీంతో ఈ కాక్ టెయిల్ పై ఇప్పుడు చర్చ నడుస్తోంది.