Hatras: యోగీ సర్కారు కీలక నిర్ణయం... హాత్రాస్ కేసు విచారణ సీబీఐ చేతికి!
- సంచలనం సృష్టించిన హాత్రాస్ ఘటన
- బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
- సీబీఐని అప్పగిస్తూ యోగి కార్యాలయం ఆదేశాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ హాత్రాస్ అత్యాచారం, హత్య ఘటన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ, యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన కాసేపటికే యోగి సర్కారు నుంచి ఈ ప్రకటన వెలువడింది.
"ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మొత్తం హాత్రాస్ కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించారు" అని సీఎం కార్యాలయం, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ కేసులోని నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారం బీజేపీపై ఒత్తిడిని పెంచుతోందని, ఇటీవలి కాలంలో దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. హాత్రాస్ ఘటనతో పాటు రెండు హత్యాచారాలు, పలు అత్యాచారాలు గడచిన వారం రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చాయి. వీటిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ, కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో, నష్ట నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందన్న విషయం ఆసక్తికరమైంది.