Mahatma Gandhi: శ్రీలంకలోనూ మన మహాత్ముడికి నివాళులు
- టెంపుల్ ట్రీస్ నివాసంలో గాంధీకి నివాళులు అర్పించిన లంక ప్రధాని
- గాంధీ అందరివాడన్న భారత దౌత్య కార్యాలయం
- ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మారంటూ ట్వీట్
భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శ్రీలంకలోనూ నివాళులు అర్పించారు. మహాత్ముడి 151వ జయంతి సందర్భంగా కొలంబోలోని ప్రధాని అధికారిక నివాసం 'టెంపుల్ ట్రీస్' అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మహాత్ముడి విగ్రహానికి ప్రధాని మహీంద రాజపక్స నివాళి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీలంకలోని భారత దౌత్య అధికారులు, శ్రీలంక ప్రభుత్వ ప్రముఖులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దీనిపై కొలంబోలోని భారత దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. మహాత్మాగాంధీ భారత్ పుత్రుడే అయినా, ఆయన ప్రపంచానికి చెందినవాడని పేర్కొంది. భారత్ కు నిజమైన స్వాతంత్ర్యం వస్తే అది పొరుగుదేశాలకు కూడా ఉపయోగకరం అని భావించాడని, ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మిన వ్యక్తి గాంధీజీ అని కొనియాడింది. వసుధైక కుటుంబం అనే భావనను బలంగా విశ్వసించాడని తెలిపింది.
కాగా, శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం టెంపుల్ ట్రీస్ లో మహాత్ముడి విగ్రహాన్ని గతేడాది ఆవిష్కరించారు. 2019లో మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా అప్పటి ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ కాంస్య విగ్రహావిష్కరణలో పాలుపంచుకున్నారు.