muslim personal law board: బాబ్రీ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తాం: ముస్లిం లాబోర్డు
- కోర్టు తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్ర అసంతృప్తి
- వందలాదిమంది ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు పట్టించుకోలేదన్న జిలానీ
- ఇతర ముస్లిం సంస్థలతో కలిసి హైకోర్టుకు
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రక్రియ తర్వాత నిన్న వెలువడిన బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ముస్లిం సంస్థలతో కలిసి హైకోర్టులో సవాలు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖలాద్ రషీద్ ఫిరంగి మహాలి తెలిపారు. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై కచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్‌యాబ్ జిలానీ కూడా స్పష్టం చేశారు.
నిందితులు స్టేజిపై నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు ఈ విషయంలో సాక్ష్యం కూడా ఇచ్చారని పేర్కొన్నారు. వందలాదిమంది ఇచ్చిన సాక్ష్యాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బాబ్రీ కూల్చివేత ముందస్తు పథకం ప్రకారం జరగలేదని కోర్టు పేర్కొనడాన్ని జిలానీ తప్పుబట్టారు.
దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన బాబ్రీ కేసులో తీర్పు నిన్న వెల్లడైంది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా 32 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.