Babbri masjid: నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశం
- 6 డిసెంబరు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత
- నిందితులుగా ఎల్‌కే అద్వానీ, జోషీ వంటి సీనియర్ నేతలు
- విచారణ సమయంలోనే 17 మంది నిందితుల మృతి
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడనుంది. మరికొన్ని గంటల్లో తీర్పు రానున్న నేపథ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలతోపాటు సంఘ్ పరివార్ నేతలు, ప్రస్తుతం రామాలయ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తదితరులు నిందితులుగా ఉండడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. తీర్పు నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ ఎంతమంది హాజరవుతారన్నది వేచి చూడాల్సిందే.
6 డిసెంబరు 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ (92), కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి (86), యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర వంటి మొత్తం 49 మంది హేమాహేమీలు నిందితులుగా ఉన్నారు. వీరిలో బాలాసాహెబ్ థాకరే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, పరమహంస రామచంద్ర దాస్, వినోద్ కుమార్ వత్స్, రాంనారాయణ్ దాస్ తదితర 17 మంది నిందితులు మరణించారు.