NCB: రియా తన ఇంట్లోనే డ్రగ్స్ నిల్వ చేసి, సుశాంత్ కు ఇచ్చేది: కోర్టుకి తెలిపిన ఎన్సీబీ
- బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన రియా, షోవిక్
- 18 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్సీబీ
- ఈ కేసులో ఎన్డీపీఎస్ సెక్షన్ 27ఏ వర్తిస్తుందని స్పష్టీకరణ
డ్రగ్స్ వ్యవహారంలో బెయిల్ కోరుతూ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ (ఎన్సీబీ) అధికారులు 18 పేజీల అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించారు. ఇందులో ఆసక్తికర అంశాలు తెలిపారు. సుశాంత్ కు డ్రగ్స్ ను సరఫరా చేయడంలో రియా పాత్ర ఉందని స్పష్టం చేశారు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని తెలిసి కూడా రియా అతడికి దగ్గరైందని తెలిపారు.
రియా, షోవిక్ తమ వద్ద పనిచేసే సిబ్బంది సాయంతో డ్రగ్స్ తెప్పించేవారని, వాటిని రియా తన ఇంట్లో నిల్వచేసి సుశాంత్ కు ఇచ్చేదని అఫిడవిట్ లో వివరించారు. రియా, షోవిక్ లకు ముంబయిలోని మాదక ద్రవ్యాల సరఫరా దారులతో సంబంధాలు ఉన్న విషయం స్పష్టమైందని, డ్రగ్స్ కు డబ్బులు చెల్లించారన్నది తేటతెల్లమైందని తెలిపారు.
అయితే, ఆ డ్రగ్స్ ను వారు ఉపయోగించారని కాదని, మరో వ్యక్తి కోసం తెప్పించారని స్పష్టం చేశారు. అందువల్ల వీరిపై ఎన్డీపీఎస్ సెక్షన్ 27ఏ వర్తింపచేయొచ్చని, వారికి బెయిల్ ఇవ్వొద్దని ఆ అఫిడవిట్ లో ఎన్సీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు. వీళ్లిద్దరూ డ్రగ్స్ సరఫరా చేశారని, ఇది తీవ్ర నేరమని పేర్కొన్నారు.