Sharad Pawar: ఎన్డీయేలో చేరండి.. పెద్ద పదవి తీసుకోండి: శరద్ పవార్‌కు కేంద్రమంత్రి అథవాలే ఆహ్వానం
- శివసేనతో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు
- రాష్ట్రాభివృద్ధి కోసం మాతో చేతులు కలపండి
- బీజేపీతో శివసేన మళ్లీ కలిసి ముందుకు సాగాలి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. శివసేనతో ఉండడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, ఎన్డీయేలో చేరితే భవిష్యత్తులో ‘పెద్ద పోస్టు’ లభించే అవకాశం ఉందని అన్నారు.
‘‘బీజేపీతో శివసేన మళ్లీ చేతులు కలపాలి. శివసేన కనుక మాతో కలిసేందుకు రాకపోతే, ఎన్డీయేలో చేరాలని శరద్ పవార్‌ను కోరుతున్నా. రాష్ట్రాభివృద్ధి కోసం మాతో చేతులు కలపమని అభ్యర్థిస్తున్నా. ఎన్డీయేలో కనుక చేరితే భవిష్యత్తులో ఆయనకు ‘పెద్ద పోస్టు’ లభిస్తుంది. శివసేనతో కలిసి ఉండడం వల్ల ఆయనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అని రాందాస్ పేర్కొన్నారు.
సోమవారం ముంబైలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశం అనంతరం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 105 సీట్లు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 288 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత బీజేపీతో విభేదాలు రావడంతో శివసేన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.