Syeda Anwara Taimur: అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి అన్వర తైమూర్ కన్నుమూత
- నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన తైమూర్
- రెండుసార్లు మంత్రిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన తైమూర్
- ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ సంతాపం
అసోంకు ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన సైదా అన్వర తైమూర్ ఆస్ట్రేలియాలో నిన్న కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన తైమూర్ డిసెంబరు 1980 నుంచి ఆ తర్వాతి సంవత్సరం జూన్ వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో యాంటీ ఫారెనర్ ఉద్యమం (1979-85) తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
1972, 1978, 1983, 1991లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తైమూర్ రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు (1988, 2004) రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 2011లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో బద్రుద్దీన్ అజ్మల్ సారథ్యంలోని ఐఏయూడీఎఫ్‌లో చేరారు. తైమూర్ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వశర్మ తదితరులు సంతాపం తెలిపారు.