Hyderabad: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?: పరిశోధన చేపట్టిన సీసీఎంబీ

CCMB starts new study on corona virus

  • ఆసుపత్రుల్లోని ఐసీయూ, కొవిడ్ వార్డుల నుంచి గాలి నమూనాల సేకరణ
  • బ్యాంకులు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ పరిశోధన
  • చురుగ్గా సాగుతున్న అధ్యయనం

ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి మాత్రమే వ్యాపిస్తుందని ఇప్పటి వరకు నిర్ధారణ అయింది. అయితే, వైరస్ గాలి ద్వారా కూడా సోకే ప్రమాదాన్ని కొట్టిపడేయలేమని ఇటీవల కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో గాలి ద్వారా ఈ ప్రమాదకర వైరస్ ఎంతదూరం ప్రయాణించగలదు? ఎంత సేపు అది గాలిలో ఉండగలదు? బాధిత వ్యక్తి నుంచి బయటకు వచ్చిన వైరస్ ఎంతసేపు మనగలదు? అన్న విషయాలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పది రోజుల క్రితం మొదలైన ఈ పరిశోధన ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.

ఆసుపత్రి వాతావరణంలో వైరస్ వ్యాప్తిపై ప్రస్తుతం పరిశోధన జరుగుతోందని, దీని ఫలితాల ఆధారంగా బ్యాంకు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టనున్నట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆసుపత్రిలోని ఐసీయూ, కొవిడ్ వార్డు తదితర ప్రాంతాల్లో రోగికి రెండు నుంచి 8 మీటర్ల దూరంలోని గాలి నమూనాలను సేకరించనున్నట్టు చెప్పారు. వైరస్ గాలి ద్వారా ఎంతదూరం ప్రయాణించగలదో తెలుసుకుంటే ఆరోగ్య కార్యకర్తలకు కల్పించే రక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని రాకేశ్ మిశ్రా వివరించారు.

Hyderabad
CCMB
COVID-19
Hospitals
Banks
  • Loading...

More Telugu News