Tejaswi Surya: బెంగళూరుపై కామెంట్ చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కాంగ్రెస్ విమర్శలు
- బెంగళూరు టెర్రరిస్టులకు అడ్డాగా మారుతోందన్న తేజశ్వి
- నగర ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారన్న డీకే
- తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్
బెంగళూరు నగరంపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెంగళూరు టెర్రరిస్టులకు అడ్డాగా మారుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన తేజస్వి చేసిన వ్యాఖ్యలు నగర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మండిపడ్డారు. తేజశ్వి వ్యాఖ్యలు బీజేపీకి అవమానకరమని... తక్షణమే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తేజస్వి వ్యాఖ్యలను సీఎం యడియూరప్ప వెనకేసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయనే ఉద్దేశంతోనే తేజశ్వి అలా వ్యాఖ్యానించారని అన్నారు.
బెంగళూరులోని కేజే హళ్లి, డీజే హళ్లి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మూక దాడుల గురించి తేజశ్వి నిన్న మాట్లాడారు. పలువురు ఉగ్రవాదుల అరెస్ట్, స్లీపర్ సెల్స్ గుట్టును ఎన్ఐఏ రట్టు చేసిన ఉదంతాలు... నగరంలో టెర్రరిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. నగరంలో ఎన్ఐఏ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హెంమంత్రి అమిత్ షాను కోరానని తెలిపారు.