Donald Trump: అమెరికాలో కన్నా ఇండియాలోనే ఎక్కువ టాక్స్ కట్టిన ట్రంప్... 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనం!

Donald Trump Paid More Tax to India than USA
  • యూఎస్ లో 750 డాలర్ల పన్ను, ఇండియాకు 1.45 లక్షల డాలర్ల పన్ను
  • గత 15 ఏళ్లలో పదేళ్లు టాక్స్ ఎగవేసిన ట్రంప్
  • తీవ్ర సంచలనం సృష్టిస్తున్న తాజా కథనం
మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్న డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేశారని, అమెరికాలోకన్నా, ఆయన ఇండియాలో అధిక పన్నులు చెల్లించారని చెబుతూ 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ఆధారాలతో సహా ప్రచురించి, సంచలనాన్ని రేపింది. ఎన్నో బిలియన్ డాలర్ల వ్యాపారాలను నడుపుతున్న ఆయన, 2016లో కేవలం 750 డాలర్ల పన్నును మాత్రమే యూఎస్ ప్రభుత్వానికి చెల్లించారని, ఆపై వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన తరువాత 2017లోనూ అంతే మొత్తాన్ని పన్నుగా కట్టారని పేర్కొంది.

గడచిన 20 సంవత్సరాల్లో ట్రంప్ ఆదాయ పన్ను రిటర్నుల వివరాలను సంపాదించిన పత్రిక, గత 15 ఏళ్లలో, 10 సంవత్సరాలు ఆయన ఒక్క డాలర్ పన్ను కూడా కట్టలేదని తెలిపింది. ఇదే సమయంలో 2017లో ట్రంప్ నిర్వహిస్తున్న సంస్థలు ఇండియాకు 1,45,450 డాలర్లను పన్నుగా చెల్లించాయని, అమెరికాలో చెల్లించిన పన్నులతో పోలిస్తే, ట్రంప్ ఇండియాకే అధికంగా చెల్లించారని తెలిపింది.

ఇదిలావుండగా, రిచర్డ్ నిక్సన్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి, పదవిలో ఉన్నన్ని సంవత్సరాల్లో అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి, వారి ఆదాయ, వ్యయ వివరాలను బహిర్గతం చేస్తూ రాగా, ట్రంప్ మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన బెట్టారు. ఆదాయ వివరాలను తెలియజేయాలని డిమాండ్ చేసిన వారిపై ట్రంప్ న్యాయపోరాటానికి దిగారు కూడా.

ఇక తాజా వార్తలపై స్పందించిన ట్రంప్, న్యూయార్క్ టైమ్స్ కథనం తప్పుడుదని అన్నారు. ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ, అన్నీ కాకపోయినా, చాలా అంశాలు అవాస్తవమని, గత పదేళ్లలో ట్రంప్, సుమారు మిలియన్ డాలర్లను పన్ను రూపంలో చెల్లించారని, అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కూడా చాలా పన్ను కట్టారని స్పష్టం చేశారు.
Donald Trump
USA
India
Tax

More Telugu News