Sasi Tharoor: క్రికెట్ కు 'తదుపరి ధోనీ' ఎవరో చెప్పేసిన శశి థరూర్... కామెంట్ చేసిన గౌతమ్ గంభీర్!
- పంజాబ్ తో మ్యాచ్ లో 85 పరుగులు చేసిన సంజూ శాంసన్
- తదుపరి ధోనీ వచ్చేశాడని శశిథరూర్ ట్వీట్
- సంజూ శాంసన్ గా మాత్రమే ఉంటాడన్న గంభీర్
కాంగ్రెస్ నాయకుడు, కేరళ క్రికెట్ ను ప్రోత్సహించడంలో ముందుండే శశిథరూర్, నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ తరువాత, తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఈ మ్యాచ్ లో 85 పరుగులు సాధించి, జట్టు అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ పై పొగడ్తలు కురిపించారు. భారత క్రికెట్ కు తదుపరి ధోనీగా సంజూ మారతాడని వ్యాఖ్యానించగా, శశిథరూర్ ట్వీట్ పై గౌతమ్ గంభీర్ స్పందిస్తూ కామెంట్ చేశాడు.
తొలుత శశిథరూర్ ట్వీట్ చేస్తూ, "రాజస్థాన్ రాయల్స్ పై ఎంత అద్భుతమైన విజయం. నమ్మశక్యం కానిది. సంజూ శాంసన్ మరో పదేళ్లు భారత క్రికెట్ లో ఉంటాడని చెప్పగలను. సంజూ 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఏదో ఒక రోజు దేశ క్రికెట్ కు తదుపరి ధోనీ అవుతావని చెప్పాను. ఆ రోజు వచ్చేసింది. ఈ ఐపీఎల్ లో సంజూ ఇప్పటికే రెండు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మీకు తెలుసా? ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్ వచ్చేశాడు" అని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేసిన గౌతమ్ గంభీర్, "సంజూ శాంసన్, మరొకరు ఎవరో అవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో అతను సంజూ శాంసన్ గానే ఉంటాడు" అని అన్నారు. ఈ రెండు ట్వీట్లూ వైరల్ అవుతున్నాయి.
కాగా, నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగగా, 224 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ ఛేదించి, ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద చేజింగ్ ను రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సంజూ 85 పరుగులు చేయగా, చివర్లో తెవాటియా మెరుపులు జట్టుకు విజయాన్ని అందించాయి. అంతకుముందు సీఎస్కేపై జరిగిన మ్యాచ్ లో సంజూ 74 పరుగులు సాధించాడు.