Kerala: కేరళలో మహమ్మారి ఉగ్రరూపం... వారం రోజుల్లో 40 వేల కొత్త కరోనా కేసులు!
- కేరళలో ప్రారంభమైన సెకండ్ వేవ్
- నిబంధనలను సడలించడమే కారణం
- ఆరోగ్య మంత్రి కేకే శైలజ
కరోనా ఇండియాకు ప్రవేశించిన తొలి దశలో, అత్యధిక కేసులను కలిగివున్నప్పటికీ, ఆపై వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసిన రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న కేరళలో, ఇప్పుడు మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 40 వేల కొత్త కేసులు వచ్చాయి. ఓనమ్ పండగ సందర్భంగా నిబంధనలను సడలించడం, ఆపై దేవాలయాలను తెరవడం వంటి కారణాలతో పాటు, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం, నిరసనల్లో పాల్గొనడం కూడా కేసుల పెరుగుదలకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి.
కాగా, వచ్చే నెలలో కేరళలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ హెచ్చరించారు. టెస్ట్ పాజిటివ్ రేటు దేశవ్యాప్తంగా సగటున 8 శాతం ఉండగా, కేరళలో మాత్రం 11.9 శాతంగా ఉందని ఆమె గుర్తు చేశారు. కరోనా వైరస్ వచ్చిన తొలి రోజు నుంచి తమ వ్యూహం ఒకటేనని, మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేశామని, తమ చర్యలతోనే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని ముందుగానే అంచనా వేశామని తెలిపారు.
వైరస్ ను తక్కువగా అంచనా వేయకుండా రాష్ట్ర ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజా సమూహాల మధ్యకు వెళ్లవద్దని శైలజ సూచించారు. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 860 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, వారిలో 15 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఆమె, లక్షణాలు లేని కరోనా రోగులను ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఆదేశించామన్నారు.