Chandrababu: చంద్రబాబు ఇంటికి నోటీసులు.. ముంపు నేపథ్యంలో హెచ్చరికలు
- ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా కృష్ణకు పోటెత్తుతున్న వరద
- చంద్రబాబు ఇల్లు సహా మరో 36 భవనాలకు హెచ్చరిక నోటీసులు
- ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట లోపల వైపు ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటితోపాటు 36 భవనాలకు అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వరద ముంపు నేపథ్యంలోనే అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకు కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా, ఇన్‌ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులు ఉంది. ఫలితంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీటమునిగాయి. దీంతో విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత బాధితులను తరలిస్తున్నారు. కంట్రోల్ రూము ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.