Kamal Haasan: అన్నాడీఎంకే కేంద్ర వ్యవసాయ బిల్లుకు మద్దతు పలకడం రైతులకు నమ్మకద్రోహం చేయడమే: కమలహాసన్
- నూతన వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చిన కేంద్రం
- మద్దతు పలికిన అన్నాడీఎంకే
- రాష్ట్రాలపై దాడిగా అభివర్ణించిన కమల్
కేంద్రం ఇటీవల నూతన వ్యవసాయ చట్టం బిల్లుతో పాటు, పలు అనుబంధ బిల్లులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవసాయ బిల్లులు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలకు కారణమయ్యాయి. కేంద్రం వైఖరికి నిరసనగా ఎన్డీయే నుంచి కొన్ని పార్టీలు వైదొలగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు మద్దతు పలకడం ద్వారా అన్నాడీఎంకే రైతులకు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు.
ఈ బిల్లులను రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై దాడిగా అభివర్ణించారు. కొరత, ధరల అంశంలో ఓ రాష్ట్రం ఏమీ చేయలేని దారుణమైన పరిస్థితి ఈ బిల్లుల కారణంగా ఏర్పడుతుందని కమల్ విమర్శించారు. ఈ బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించకుండా తిప్పి పంపాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు మేలు చేసేందుకు మిగిలిన ఏకైక మార్గం అదొక్కటేనని స్పష్టం చేశారు.