Adhir Ranjan Choudary: హీరో సుశాంత్ సింగ్ ను రాజకీయాలే చంపేశాయి: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి
- బీహార్ ఎన్నికల కోసం సుశాంత్ కేసును బీజేపీ వాడుకుంటోంది
- సీబీఐ విచారణలో ఏమీ దొరకలేదు
- ఇప్పుడు డ్రగ్స్ మీద పడ్డారు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ఇప్పటికీ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు రాజకీయ పార్టీలకు సైతం తలనొప్పిగా మారింది. ఈ కేసు నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య విభేదాలు తలెత్తి, వ్యవహారం రచ్చరచ్చగా మారింది. ఈ కేసు విచారణ క్రమంలోనే బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎన్సీబీ విచారణను ఎదుర్కొంటున్నారు.
మరోవైపు సుశాంత్ ను రాజకీయాలే చంపేశాయని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల కోసం సుశాంత్ కేసును బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. సీబీఐ విచారణలో ఏదీ దొరక్కపోయేసరికి ఇప్పుడు డగ్స్ పై పడ్డారని అన్నారు. సీబీఐ, ఈడీలను పక్కనపెట్టి ఇప్పుడు ఎన్సీబీని రంగంలోకి దించారని చెప్పారు.
విచారణ పేరుతో ఒక్కొక్కరికి సమన్లు పంపుతున్నారని అధిర్ మండిపడ్డారు. ఎన్సీబీ విచారణలో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు? టెర్రరిస్టుల లింకులేమైనా బయటపడ్డాయా? అని ప్రశ్నించారు. సుశాంత్ ను ఎవరూ హత్య చేయలేదని... ఈ బుద్ధిలేని రాజకీయాలే చంపేశాయని అన్నారు.