Sunil Gavaskar: అనుష్క శర్మను నేనెప్పుడూ నిందించలేదు: గవాస్కర్ వివరణ
- మ్యాచ్ సందర్భంగా వివాదాస్పదమైన సన్నీ వ్యాఖ్యలు
- గవాస్కర్ ను తప్పుబట్టిన అనుష్క శర్మ
- తనలో ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్న క్రికెట్ దిగ్గజం
విరాట్ కోహ్లీ ఫామ్ ను దృష్టిలో ఉంచుకుని సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై అనుష్క శర్మ ఘాటుగా స్పందించడం తెలిసిందే. పంజాబ్ తో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ వైఫల్యం చెందడం పట్ల గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ, లాక్ డౌన్ రోజుల్లో కోహ్లీ కేవలం అనుష్క బౌలింగ్ నే ఎదుర్కొని ఉంటాడు అని చమత్కరించారు. దీనిపై అనుష్క స్పందిస్తూ గవాస్కర్ వ్యాఖ్యలు భరింపరానివిగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, తన వ్యాఖ్యల పట్ల గవాస్కర్ వివరణ ఇచ్చారు. తానెప్పుడూ అనుష్కను నిందించాలన్న ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తన మాటలను సరైన కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. లాక్ డౌన్ సందర్భంగా కోహ్లీ తన నివాసంలో భార్య అనుష్క బౌలింగ్ ను ఎదుర్కొంటున్న వీడియో గురించి ప్రస్తావిస్తూ తాను వ్యాఖ్యలు చేశానే తప్ప, ఇందులో ఎవరినీ తప్పుబట్టింది లేదని అన్నారు.
అంతేకాకుండా, తాను లింగ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుండడంపైనా గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు. క్రికెట్ టూర్ల కోసం వెళ్లేటప్పుడు ఆటగాళ్ల వెంట వారి భార్యలు కూడా ఉండాలని వాదించేవాళ్లలో తాను కూడా ఉంటానని స్పష్టం చేశారు. "ఓ సాధారణమైన వ్యక్తి ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి భార్యతో గడుపుతాడు. ఈ అవకాశం క్రికెటర్లకు ఎందుకు ఉండదని వాదించేవారిలో నేనూ ఒకడ్ని" అని పేర్కొన్నారు.