SP Balasubrahmanyam: 'పాడుతా తీయగా' అంటూ మన మనిషిలా ఇంట్లోకి వచ్చేసిన బాలూ!
- 1996లో తొలి ఎపిసోడ్ ద్వారానే ఆకట్టుకున్న బాలు
- కార్యక్రమం కోసం ఇళ్లల్లో అంతా ఎదురుచూపులు
- పాట వెనుక ఇంత కథ ఉందా? అనిపించేది
- మన సంస్కృతీ సంప్రదాయాల గురించీ చెప్పేవాడు
బాలూ సినిమా జీవితం అంతా ఒకెత్తయితే.. 'పాడుతా తీయగా' ఒక్కటీ ఒకెత్తు అని చెప్పాలి. 1996లో ఈటీవీలో మొదటి సారిగా ఈ కార్యక్రమం ద్వారా కొత్త బాలూ కనిపించాడు. అంతవరకూ బాలూ అందరికీ తన పాటల ద్వారా వినిపించాడు. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ కనిపించాడు.
అయితే, పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా బాలూ మనందర్నీ కట్టిపడేశాడు. రెండు మూడు ఎపిసోడ్లు అవగానే ఇక మన ఇంట్లో 'మనిషి' అయిపోయాడు. పాడుతా తీయగా ఎప్పుడొస్తుందీ? అంటూ తెలుగు వాళ్లంతా ఎదురుచూడ్డం మొదలెట్టారు. ఆ క్షణాల కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూసేవారు. అంతగా మన బాలూ మనపైన సరిగమల ముద్ర వేసేశాడు.
టీవీలకు అతుక్కుపోతాం ..
ఔత్సాహిక గాయకుల చేత పాటలు పాడిస్తూ.. ఆ గాయకుల తప్పొప్పులు చెప్పడంతో పాటు ఆ పాట గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్పేవాడు. అప్పటి రికార్డింగ్ అనుభవాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే చెప్పేవాడు. ఆ సంగీత స్రష్టల ప్రతిభ గురించి.. ఆ కవుల గొప్పతనం గురించి.. ఆ గాయకుల సత్తా గురించి.. ఆ దర్శకుల శైలి గురించి.. ఆ పాటలలో ఆయా నటుల నటన గురించి ఎన్నో.. ఎన్నో కొత్త విషయాలు వివరించేవాడు. ఈ పాట వెనుక ఇంత కథ ఉందా? అని మనకు అనిపించేది. అందుకే బాలూ 'పాడుతా తీయాగా' వస్తోందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతాం.
నొప్పింపక తానొవ్వక..
ఆ కార్యక్రమంలో పాట పాడుతున్న గాయకులు ఎక్కడా ఫీలవకుండా.. ఏమాత్రం నొచ్చుకోకుండా.. వాళ్లు చేసిన తప్పులను ఇంట్లో నాన్న చెబుతున్నట్టుగా బుజ్జగిస్తూ.. గారం చేస్తూ..తను గానం చేస్తూ వాళ్లకు చెప్పడం బాలూలోని స్పెషాలిటీ. అలా వాళ్ల తప్పులు సరిచేయడమే కాకుండా, మళ్లీ వాళ్ల చేత కరెక్టుగా పాడించి.. ఓ గురువుగా వాళ్లని సాకేవాడు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది ఆ తర్వాత సినిమాలలో మంచి గాయకులుగా రాణిస్తున్నారంటే.. ఆ గాయకరత్నాలను గుర్తించి వెలుగులోకి తెచ్చిన బాలూ ఘనతే అది!
ఆబాలగోపాలానికీ బంధువు..
ఈ పాడుతా తీయగా కేవలం పాటలు పాడించే సంగీత కచ్చేరీ మాత్రమే కాదు. ఇందులో మాటల సందర్భంలో మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గురించీ చెబుతాడు.. పెద్దల పట్ల పిల్లలు ఎలా ఉండాలన్న సంస్కారం నేర్పుతాడు.. మరుగున పడిపోతున్న మన తరతరాల ఆస్తిలాంటి రంగస్థల పద్యాలను గాయకుల చేత పాడించి పెద్ద వాళ్లకు వాటిని ఓసారి గుర్తుచేస్తాడు.. నాలుగైదు దశాబ్దాల నాటి పాత సినిమా పాటలను పాడించి పెద్దలని మళ్లీ ఓసారి పాత జ్ఞాపకాలలోకి తీసుకుపోతాడు.. మధ్యలో అప్పుడప్పుడు చిన్న పిల్లాడిలా గారంపోతాడు.. చిలిపిగా అలుగుతాడు.. చలాకీగా జోకులేస్తాడు.. నాటి సంగీత దర్శకుల్ని, కవుల్ని అనుకరిస్తూ నవ్వులు పూయిస్తాడు.. చెణుకులు విసురుతాడు.. చమక్కులు చెబుతాడు.. అందుకే బాలూ ఈ 'పాడుతా తీయగా'తో ఆబాలగోపాలానికీ బంధువైపోయాడు!