New Delhi: విషమంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యం
- అస్వస్థతతో బుధవారం ఆసుపత్రిలో చేరిన సిసోడియా
- డెంగీ తోడవడంతో పడిపోతున్న ప్లేట్‌లెట్లు
- ఎల్ఎన్‌జేపీ నుంచి మ్యాక్స్ ఆసుపత్రికి తరలింపు
కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మూడు రోజుల క్రితం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్‌జేపీ) ఆసుపత్రిలో చేరారు. తాజాగా, ఆయనకు డెంగ్యూ కూడా సోకిందని, ఆయన బ్లడ్ ప్లేట్‌లెట్లు కూడా క్రమంగా పడిపోతున్నట్టు ఆయన కార్యాలయం నిన్న పేర్కొంది. మరోవైపు, ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు.
జ్వరంతోపాటు ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయిన స్థితిలో సిసోడియా బుధవారం ఆసుపత్రిలో చేరినట్టు ఎల్‌ఎన్‌జేపీ వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను ఎల్ఎన్‌జేపీ నుంచి సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులలో కరోనా సోకిన వారిలో సిసోడియా రెండోవారు. జూన్‌లో మంత్రి సత్యేంద్ర జైన్ కరోనాతో ఆసుపత్రిలో చేరగా అదే నెల 26న కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.