Congress: జాతీయ స్థాయిలో నిరసనలు ప్రారంభించిన కాంగ్రెస్!
- వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న పలు పార్టీలు
- గురువారం నుంచి ప్రారంభమైన నిరసనలు
- పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు
- నిరసనలను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించిన కాంగ్రెస్ కమిటీ
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పలు విపక్ష పార్టీల సహకారంతో, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో నిరసనలు ప్రారంభించింది. నేటి నుంచి రెండు నెలల పాటు సామూహిక నిరసనలు తెలియజేయాలన్న పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు, ఈ ఉదయం పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్ సహా పలు పార్టీల కార్యకర్తలు నిరసనలకు దిగారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని, వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తుండగా, పలు ప్రాంతాల్లో నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
కాగా, ఈ బిల్లులకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది సంతకాలు సేకరించాలని కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ లతో పాటు, నిత్యావసరాల చట్ట సవరణ తదితర బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సంగతి విదితమే.
తమకు బలమున్న లోక్ సభలో ఈ బిల్లులన్నీ సులువుగానే ఆమోదం పొందేలా చేసుకున్న బీజేపీ, రాజ్యసభ విషయంలో మాత్రం చాలా వ్యతిరేకత మధ్య ఆమోదం పొందింది. రాజ్యసభలో నాటకీయ పరిణామాలు జరిగాయి. డిప్యూటీ చైర్మన్ పై దాడికి సభ్యులు ప్రయత్నించారని ఆరోపిస్తూ, 8 మందిని సస్పెండ్ చేయగా, వారంతా పార్లమెంట్ పచ్చిక బయళ్లపైనే రాత్రంతా ఉండిపోయి నిరసన తెలిపారు.
ఆపై పొద్దున్నే డిప్యూటీ చైర్మన్ హరివంశ్, వారి వద్దకు టీ తీసుకెళ్లి, దౌత్యం చేసే ప్రయత్నం చేయగా, అది విఫలమైంది. దీంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాను కూడా 24 గంటల నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తర్వాత సభ షెడ్యూల్ సమయానికన్నా ముందుగానే వాయిదా పడగా, కాంగ్రెస్ ఈ బిల్లులపై రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించుకుంది.
ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ సోనియా అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ఉంటారు. వీరంతా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.