Nimmala Rama Naidu: భార్యతో కలిసి తిరుమల దర్శనం చేసుకోవడానికి జగన్ కు ఉన్న ఇబ్బంది ఏమిటో?: రామానాయుడు
- డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పడం సరికాదు
- అన్ని మతాల మందిరాలను కాపాడాల్సిన అవసరం సీఎంపై ఉంది
- సతీసమేతంగా స్వామిని దర్శించుకోవడం ఆనవాయతీ
ఈ సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మరోవైపు జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, హిందూమత ఆచారం ప్రకారం సతీసమేతంగా స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయతీ అని చెప్పారు. సతీసమేతంగా వెంకన్న దర్శనం చేసుకోవడానికి జగన్ కు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి సనాతన హిందూ ఆచారాన్ని ధిక్కరించి, డిక్లరేషన్ ఇవ్వను అనడం సరికాదని అన్నారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలు, సంస్థలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని అన్నారు. మరోవైపు, డిక్లరేషన్ అవసరం లేదన్న వైసీపీ నేతల ప్రకటనకు నిరసనగా పాలకొల్లు వెంకటేశ్వరస్వామి ఆలయంలో రామానాయుడు ప్రత్యేక పూజలను నిర్వహించారు.