Prasanna Kumar: మంత్రులు అనిల్, గౌతమ్ ఇద్దరికీ చెబుతున్నా... ఇది పద్ధతి కాదు: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్
- సంగంలో రైతులపై కేసులు!
- కేసులు వెనక్కి తీసుకోవాలంటూ ప్రసన్నకుమార్ డిమాండ్
- మంత్రులిద్దరూ ఎస్పీతో మాట్లాడాలని స్పష్టీకరణ
నెల్లూరు జిల్లా సంగంలో రైతులపై కేసులు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వెల్లడించారు. అప్పులు చేసి, పంటలు పండించుకుని, ఆ పంటకు మద్దతు ధర రాకపోతే రైతులు రోడ్డెక్కారని, అంతమాత్రాన వారిపై కేసులు నమోదు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం మీకు... అది కూడా మంత్రిగారి నియోజకవర్గంలో రైతులపై కేసులా? చేతనైతే ధాన్యం కొనని మిల్లర్లపైనా, దళారులపైనా కేసులు పెట్టండి అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.
"రైతులపై కేసులు అన్యాయం. దయచేసి కేసులు ఉపసంహరించుకోమని ఎస్పీతో మాట్లాడాలని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు చెబుతున్నా. గౌతమ్, అనిల్ కుమార్... ఇది మంచి పద్ధతి కాదు. ఓవైపు రాష్ట్రంలో రైతు ముఖంలో ఆనందం కనిపించాలని సీఎం జగన్ తంటాలు పడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు. రైతులను మోసం చేస్తున్న దళారులు, మిల్లర్లపై కేసులు పెట్టండి. వెంటనే అనిల్ కుమార్, గౌతమ్ జోక్యం చేసుకుని సంగంలో రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
రూ.15,590 మద్దతు ధరను జగన్ ప్రకటిస్తే, ఆ ధరను మిల్లర్లు ఇవ్వక, ధాన్యం చెడిపోతుంటే రైతులు ఎంతో ఆవేదనతో రోడ్డు మీద కూర్చున్నారు. దానికే అరెస్ట్ చేస్తారా? ఇది పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకోండి" అంటూ ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు చేశారు.