Hunger Strike: నేను నిరాహార దీక్షకు దిగుతున్నా: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సంచలన ప్రకటన
- నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు
- సభలో ఘటనలు మనస్తాపాన్ని కలిగించాయి
- నా దీక్షతోనైనా వారి మనసులు మారాలి
- రాజ్యసభ చైర్మన్ కి రాసిన లేఖలో హరివంశ్
రాజ్యసభలో కేంద్రం వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న సభలో సస్పెండైన సమయం నుంచి ఎనిమిది మంది ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలోనే నిరసనకు దిగి, రాత్రంతా అక్కడే కూర్చోవడం, ఆపై పొద్దున్నే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, వారి వద్దకు వెళ్లి 'చాయ్ దౌత్యం' చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడం తదితర విషయాలు విదితమే.
ఆపై హరివంశ్ సింగ్, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖను రాస్తూ, సభలో ఎంపీల ప్రవర్తనకు నిరసనగా 24 గంటల పాటు నిరాహార దీక్షకు దిగినట్టు తెలిపారు. సభలో జరిగిన ఘటనలు తనకెంతో మనస్తాపాన్ని కలిగించాయని, రాత్రంతా తనకు నిద్రపట్టలేదని ఈ లేఖలో హరివంశ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మంటూ పైకి చెబుతూ, సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తన నిరాహార దీక్ష నిర్ణయంతోనైనా వారి మనసులు మారతాయని, వారిలో స్వీయ శుద్ధీకరణ భావన రావాలన్నదే తన దీక్ష లక్ష్యమని అన్నారు. తన చర్య వారిని మారుస్తుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. కాగా, తనపై దాడి చేసిన వారికి కూడా చాయ్ తీసుకెళ్లి ఇవ్వజూపిన హరివంశ్ గొప్పవ్యక్తని, ఆయన శైలి అందరికీ ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.