Rafale Jets: చైనా సరిహద్దుల్లో భారత రాఫెల్ విమానాల మోత!

Indian Rafale jet fighters roars over Laddakh sky
  • చైనాతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం
  • భారీగా మోహరింపులు చేసిన భారత్
  • అంబాలా నుంచి లడఖ్ వరకు రాఫెల్ విమానాల గస్తీ
ఈ ఏడాది ఆరంభం నుంచి సరిహద్దుల్లో చైనా దూకుడు మరింత హెచ్చిన నేపథ్యంలో భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడంతో ఇక డ్రాగన్ ను ఎంతమాత్రం ఉపేక్షించరాదని భారత ప్రభుత్వం, సైన్యం నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో భారత్ కు రాఫెల్ యుద్ధ విమానాలు చేతికందడం గొప్ప ఆధిక్యత అని చెప్పాలి.

చైనాతో ఘర్షణల నేపథ్యంలో లడఖ్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే భారత ఆర్మీ భారీగా మోహరింపులు చేపట్టింది. వాయుసేన కూడా తనవంతుగా గగనతల పహారా కాస్తోంది. తాజాగా ఈ పహారా కోసం భారత వాయుసేన శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించింది.

అంబాలా ఎయిర్ బేస్ నుంచి లడఖ్ వరకు గగనతలంలో గస్తీ తిరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు రాఫెల్స్ ప్రయాణించాయని తెలిపారు. రాఫెల్ జెట్ ఫైటర్లు యుద్ధ రంగంలో పరిస్థితులను అనుసరించి తమ రేంజ్ ను 780 కిలోమీటర్ల పరిధి నుంచి 1,650 కిలోమీటర్ల వరకు పెంచుకోగలవని అధికారులు వివరించారు.

కాగా, త్వరలోనే రాఫెల్ స్క్వాడ్రన్ లో ఓ మహిళా పైలెట్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అంబాలా బేస్ లో కొలువుదీరిన రాఫెల్ విమానాలకు ఇప్పటివరకు పురుష పైలెట్లే ఉన్నారు. ఈ ఫ్రెంచ్ తయారీ యుద్ధ విహంగాలు ఇటీవల భారత వాయుసేనలో చేరాయి. అప్పటి నుంచి ఆ మహిళా పైలెట్ రాఫెల్ యుద్ధ విమానాలపై శిక్షణ పొందుతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
Rafale Jets
Laddakh
Border
China
India

More Telugu News